లడఖ్ పరిపాలన ఆగస్టు 6న దేశంలోనే తొలి హై ఆల్టిట్యూడ్ వైల్డ్‌లైఫ్ సఫారీ ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. సాధారణంగా కజిరంగా, రణతంభోర్ వంటి ప్రాంతాల్లో ఉండే జీప్ సఫారీ తరహాలోనే, లడఖ్ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ఓపెన్-బ్యాక్ వాహనాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. నుబ్రా, జాన్స్కర్, షామ్, కార్గిల్, ద్రాస్ వంటి ప్రాంతాలతో పాటు హేమిస్ నేషనల్ పార్క్, చాంగ్‌థాంగ్, కరకోరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో సఫారీ మార్గాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

‘పర్వతాల దెయ్యం’గా పిలిచే మంచు చిరుతలను పర్యాటకులకు చూపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 2019-2023 మధ్య జరిగిన శాస్త్రీయ అంచనాల ప్రకారం, భారత్‌లో ఉన్న 718 మంచు చిరుతల్లో 477 లడఖ్‌లోనే ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కెమెరా ట్రాప్‌ల ద్వారా ఈ ప్రాంతంలో 126 చిరుతలను నేరుగా గుర్తించింది. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఈ జంతువులను సంరక్షించడంతో పాటు, పర్యావరణ అనుకూల పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ సఫారీ ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు లడఖ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు 20 మంది యువకులను ఎంపిక చేసి, వారికి పక్షుల గుర్తింపు, వన్యప్రాణుల పరిశీలనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పర్యాటకులకు గైడ్లుగా వ్యవహరిస్తూ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. జూన్‌లో ఏర్పాటు చేసిన స్నో లెపార్డ్ అండ్ హై-ఆల్టిట్యూడ్ నేచర్ (SHAN) కన్జర్వేషన్ సొసైటీ ద్వారా ఈ వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.