తిరువనంతపురంలోని చారిత్రాత్మక జీవీ రాజా స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ వేదికగా దీనిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ రూ. 100 కోట్ల నిధులను ప్రకటించారు. 2036 సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలను ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా ఈ నిధులు కేటాయించారు.
ఈ స్టేడియం అభివృద్ధిపై మంత్రి సురేశ్ గోపీ కేరళ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ మరియు సిండికేట్ ఫైనాన్స్ సభ్యుడు ఆర్ఎస్ శశికుమార్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. 1937లో తిరువాన్కూర్ సంస్థానంలో నిర్మించిన ఈ స్టేడియం త్వరలో 90 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. గతంలో ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు వేదికైన ఈ గ్రౌండ్, ప్రస్తుతం సరైన నిర్వహణ లేక సింథటిక్ ట్రాక్ సహా పలు వసతులను కోల్పోయింది.
కేరళ క్రీడారంగ పితామహుడు కల్నల్ గోదావర్మ రాజా పేరుతో ఉన్న ఈ స్టేడియం పునరుద్ధరణకు సంబంధించి తదుపరి చర్యలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) మరియు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను కేరళ యూనివర్సిటీ తీసుకుంది.








