ఏసీసీ ప్రీమియర్ కప్-2026 టోర్నీకి సిద్ధమవుతున్న నేపాల్ జట్టు కెప్టెన్‌గా స్టార్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ సందీప్ లామిచానేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బోర్డు తన ఎక్స్ (X) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. 2022లో కూడా లామిచానే కెప్టెన్‌గా వ్యవహరించారు, అయితే ఒక వివాదం కారణంగా ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

లామిచానే స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ పౌడెల్, నేపాల్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. రోహిత్ నాయకత్వంలో నేపాల్ జట్టు ఇప్పటివరకు 63 వన్డేలు ఆడి, 31 విజయాలను నమోదు చేసింది. కెప్టెన్ మార్పుపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సందీప్ లామిచానే నాయకత్వంలో నేపాల్ జట్టు తన ప్రయాణాన్ని ఏసీసీ ప్రీమియర్ కప్‌తో ప్రారంభించనుంది. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 1న మలేషియాలోని బాయుమాస్ ఓవల్‌లో సౌదీ అరేబియాతో నేపాల్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత గ్రూప్-ఎలో భాగంగా బహ్రెయిన్, మలేషియా, హాంగ్‌కాంగ్‌ జట్లతో నేపాల్ తలపడనుంది.

ఈ టోర్నీ కోసం ప్రకటించిన నేపాల్ జట్టులో సందీప్ లామిచానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆసిఫ్ షేక్, అర్జున్ కుమాల్, రోహిత్ పౌడెల్, దేవ్ ఖనాల్, దీపేంద్ర సింగ్ ఐరీ, సుందీప్ జోరా, బాసిర్ అహ్మద్, ఇషాన్ పాండే, గుల్షన్ ఖా, షేర్ మల్లా, లలిత్ రాజ్‌బంశీ, కరన్ కేసీ, హేమంత్ ధామి సభ్యులుగా ఉన్నారు.