కొత్త ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. నోయిడాలోని స్టోర్ వద్ద ఉదయం 8 గంటలకే వినియోగదారులు క్యూలో నిలబడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొందరు అభిమానులు ఈ ఫోన్ల కోసం ప్రత్యేకంగా వచ్చారు.
ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఈ ఫోన్ కోసం తాను బంగారం అమ్మినట్లు అతను వెల్లడించాడు. పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఉదయం 6 గంటలకే స్టోర్ వద్దకు చేరుకున్నాడు.
గుర్దితా సింగ్ తన కాబోయే భార్యకు బహుమతిగా ఒక ఐఫోన్ 18 ప్రోను, తన కోసం ఒక ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఈ రెండు ఫోన్ల కోసం అతను రూ. 3.5 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. ఫోన్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో 265జీబీ (ఫోన్ మెమరీ సామర్థ్యం) వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉంది. అలాగే, అదే స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,79,900 నుంచి మొదలవుతోంది. స్టోరేజ్ ఆప్షన్లు పెరిగే కొద్దీ ఈ ధరలు కూడా పెరుగుతాయని యాపిల్ సంస్థ పేర్కొంది.






