మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ రైజింగ్ స్టార్ కాదని, అవినీతిలో స్కామ్ స్టార్‌గా ఎదిగారని ఆమె ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో సైకో పనులు చేస్తున్నారని, మూడున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తన అవినీతి కోసం వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.
డీఎస్సీ (DSC) నియామకాల్లో అక్రమాలు జరిగాయని రోజా ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారని, పేకాట ఆడేవారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆమె విమర్శించారు. ఈ అవినీతి సొమ్మును విదేశాల్లో దాచిపెట్టేందుకే లోకేష్ వెళ్తున్నారని, అక్కడ ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) తో సమగ్ర విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించారని, ఆ కేసుల్లో ఆయనకు క్లీన్‌చిట్ వచ్చిందని గుర్తు చేశారు. మరి లోకేష్‌పై ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఆయనకు లోకేష్‌పై నమ్మకం లేకే మౌనం వహిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.
విద్యార్థుల తరఫున తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోజా విమర్శించారు. మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.








