భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ధర్మన్న నగర్‌లో జిల్లాలోనే మొదటిసారిగా కంటైనర్ ఆధారిత అంగన్వాడీ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దాతల సహకారంతో రూ. 4 లక్షల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGSCPCR) సభ్యురాలు కంచర్ల వందనా గౌడ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
గిరిజన చట్టాల నిబంధనల వల్ల అటవీ ప్రాంతాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి అనుమతులు లభించవు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు కంటైనర్ ఆధారిత నిర్మాణాన్ని ఎంచుకున్నారు. గతంలో పూరి గుడిసెల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడిన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఈ కేంద్రం ద్వారా మెరుగైన సేవలు అందనున్నాయి.
ఈ కేంద్రం ద్వారా స్థానిక ఆదివాసీ చిన్నారులకు ప్రీ-స్కూల్ విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందుతాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా, కనీస మౌలిక సదుపాయాలు లేని గొత్తికోయ గ్రామంలో ఈ సదుపాయం కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఇతర మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి సదుపాయాలు కల్పించాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది.








