గతంలో వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే గుండె జబ్బులు, ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని మెడికోవర్ హాస్పిటల్స్ కార్డియాలజిస్టులు డాక్టర్ సంతోష్ మోహన్లాల్ మోడ్, డాక్టర్ షఫీ పలగిరి, డాక్టర్ శ్రవణ్ కుమార్ రాంపెల్లి పేర్కొన్నారు. మంగళవారం వరంగల్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలు ఈ సమస్యకు దారితీస్తున్నాయని వివరించారు.

మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం యువతలో గుండె సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుటుంబంలో చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే, తర్వాతి తరానికి కూడా ప్రమాదం పొంచి ఉంటుందని వారు హెచ్చరించారు. ఇటువంటి వారు ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. రక్తపోటును 130/80 కంటే తక్కువగా, చెడు కొలెస్ట్రాల్ (LDL)ను 100 కంటే తక్కువగా ఉంచుకోవడం ముఖ్యమని వారు తెలిపారు.

నివారణ చర్యల్లో భాగంగా రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర పాటించాలని వైద్యులు సూచించారు. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వారు పేర్కొన్నారు.