గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో నాలాను ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఏడు అంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 55 గజాల స్థలంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అగ్గిపెట్టెలు పేర్చినట్టుగా ఈ భవనాన్ని సాజిద్ అనే బిల్డర్ నిర్మించారు. భవనంలో టైల్స్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో భవనంలో పని చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ (34), మొహబ్బత్ (42) శిథిలాల కింద చిక్కుకొని మరణించారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీశాయి. ప్రమాదం జరిగిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - ప్రభుత్వ ఆస్తుల రక్షణ విభాగం), డీఆర్ఎఫ్ (విపత్తు నిర్వహణ బృందం), ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని శిథిలాల తొలగింపు చేపట్టాయి.

కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ జయదర్శిని రెసిడెన్సీలోని సీ బ్లాక్ అపార్ట్‌మెంట్‌పై పడటంతో అందులో ఉంటున్న రమణారెడ్డి, ఆయన భార్య సంయుక్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సీ బ్లాక్‌లోని ఐదు ఫ్లాట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ బ్లాక్‌లోని అన్ని ఫ్లాట్లను ఖాళీ చేయించారు.

ప్రస్తుతం కూలిన భవనానికి ఇరువైపులా ఉన్న మరో రెండు భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో అవి ఎప్పుడు కూలిపోతాయోనన్న ఆందోళన నెలకొంది. ఆ భవనాల్లో హాస్టళ్లు నడుస్తుండగా, పోలీసులు వాటిని కూడా ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో, అంజయ్య నగర్‌లో మరో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు.

ఈ కూల్చివేత పనుల కోసం భారీ బాహుబలి యంత్రాన్ని ఘటనా స్థలానికి తరలించారు. మరికొద్దిసేపట్లో ఈ ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేసే పనులు ప్రారంభం కానున్నాయి.