రాష్ట్రంలో వర్షాల విరామానికి తెరపడనుంది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌తో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సూర్యాపేటలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవ్వగా, ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి పలు జిల్లాల్లో 36 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ వంద శాతంగా నమోదవుతోంది. దీనివల్ల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు మళ్లీ ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండటంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది.