తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచేందుకు రవాణా శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆటో ఛార్జీల పెంపుపై అధ్యయనం చేసిన కమిటీ తన నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తికి సమర్పించగా, ఆయన దానిని ప్రభుత్వానికి పంపారు. రేవంత్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదించిన వెంటనే కొత్త ఛార్జీల అమలుపై అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయి.

గత నెలలో తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ బేస్డ్ యూనియన్ల ఐకాస (ఆటో డ్రైవర్ల సంఘాల సమన్వయ కమిటీ) 14 డిమాండ్లతో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే, 15 రోజుల్లోగా ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలు పంపుతామని అధికారుల కమిటీ హామీ ఇవ్వడంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు. ఈ క్రమంలోనే కమిటీ కేరళ, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో ఆటో ఛార్జీలపై అధ్యయనం చేసింది.

పెరిగిన ఇంధన ధరలు, వాహన బీమా, మరమ్మతులు, ఇతర నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఛార్జీల పెంపు అనివార్యమని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ సిఫార్సుల ప్రకారం, ఆటోలో తొలి 1.6 కిలోమీటర్ల ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.30గా ఉండనుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 చొప్పున అదనంగా వసూలు చేయాలని కమిటీ సూచించింది.

అంతేకాదు, ఆటోలో ప్రయాణించే సమయంలో నిరీక్షణ సమయానికి (వెయిటింగ్ టైమ్) నిమిషానికి 75 పైసలు వసూలు చేయాలని ప్రతిపాదించారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి సాధారణ ఛార్జీపై అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు వంటి నిత్య ప్రయాణికులపై నెలవారీ ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్లు చాలా కాలంగా కోరుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే, డ్రైవర్ల ఆదాయం పెరిగి వారికి కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి తుది ఆమోదం కోసం డ్రైవర్లు, ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.