రాష్ట్రంలో 17 మేయర్, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ ఛైర్మన్లను, మేయర్లను ఎన్నుకునే పరోక్ష విధానం ఉండేది. అయితే, ఈ పద్ధతిలో క్యాంప్ రాజకీయాలు, అవిశ్వాస తీర్మానాల భయం, నాయకుల ఫిరాయింపులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

స్థానిక సంస్థల్లో రాజకీయ అస్థిరతను తొలగించి, పాలన సాఫీగా సాగాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ విధానం వల్ల ప్రతి రెండేళ్లకు మేయర్లను, ఛైర్మన్లను మార్చాలనే డిమాండ్లు ఉండవని, సీట్ల పంపకంతోనే వివాదాలు ముగిసి ఐదేళ్ల పాటు గొడవలు ఉండవని కూటమి నేతలు భావిస్తున్నారు. అంతేకాదు, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజల నాడిని తెలుసుకోవడంతో పాటు, వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తోంది.

మరోవైపు, ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానం విపక్షమైన వైసీపీకి కూడా అనుకూలించవచ్చని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి బలం, కుల సమీకరణాలు, ప్రాంతీయ సెంటిమెంట్లు కీలకం కానున్నాయి. బలమైన రాజకీయ నేపథ్యం, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులే గెలిచే అవకాశం ఉండటంతో, వైసీపీ కూడా తమకు పట్టున్న చోట్ల గెలుపు కోసం పావులు కదుపుతోంది.

ప్రస్తుతానికి ముందుగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపి, 2029 ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ భావిస్తోంది. ఏది ఏమైనా, ఈ ప్రత్యక్ష పోరులో ఎవరికి లాభం చేకూరుతుందనేది ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టత రానుంది.