నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ సెక్రటరీ అవుట రవీందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ నిరసనలో నాయకులు నల్ల జెండాలను ప్రదర్శించారు.

బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO) పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను యూనియన్ నాయకులు తప్పుబట్టారు. బీఎల్ఓలు బాధ్యతగా పనిచేయరని, ఏమీ చేయకపోయినా జీతాలు అందుతాయని సీఎం బహిరంగంగా అవహేళన చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, కార్మికులను బలిపశువులను చేయడం తగదని మండిపడ్డారు.

రాష్ట్రంలో 84 శాతం ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను బీఎల్ఓలే పూర్తి చేశారని నాయకులు గుర్తు చేశారు. అంగన్‌వాడీ, ఆశా, ఆర్పీ, వీవోఏలు తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్నా, అదనపు బాధ్యతలను ప్రభుత్వం వారిపైనే మోపిందని వారు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పి.సరిత, కె.సునంద, పాడురి లక్ష్మి, మణిరూప, యాదమ్మ, జి.కృపావతి, కె.సరోజ, రేణుక, అరుంధతి, అనిత, పల్లవి, విజయకుమారి, జి.పద్మ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గాన్ని ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.