సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటి వాగులపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. దొండపాడు వద్ద మొదలై రాయపూడి, ఉండవల్లి మీదుగా మణిపాల్ ఆస్పత్రి సమీపంలోని ఎన్‌హెచ్-16 (జాతీయ రహదారి) వరకు ఈ మార్గం సాగుతుంది. 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ కారిడార్‌లో తొమ్మిది లేన్ల రోడ్లు, ప్రత్యేక బీఆర్టీఎస్ (బస్సుల కోసం ప్రత్యేక రహదారి) కారిడార్, సర్వీస్ రోడ్లు ఉంటాయి.

ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 320.54 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం గుర్తించగా, ఇప్పటికే 278.93 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూమిని సేకరించే ప్రక్రియ చివరి దశలో ఉంది. రోడ్డు నిర్మాణంతో పాటే డ్రెయినేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా పూర్తవుతున్నాయి.

బకింగ్‌హామ్ కెనాల్‌పై రూ. 82 కోట్లతో 478 మీటర్ల పొడవున నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. దీని ద్వారా వాహనదారులు విజయవాడ నుంచి నేరుగా రాజధానిలోకి ప్రవేశించవచ్చు. మరోవైపు, వరద ముప్పును నివారించేందుకు కొండవీటి వాగుపై 284 మీటర్ల పొడవుతో మరో వంతెనను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఈ రహదారిని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కృష్ణానది, కొండవీటి వాగు అందాలను చూసేందుకు వ్యూ పాయింట్లు, సైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్లను అభివృద్ధి చేస్తున్నారు. 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.