రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ప్రజా కవి అందెశ్రీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ‘అందెశ్రీ స్మృతివనం’ నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందెశ్రీని తన ఆత్మబంధువుగా అభివర్ణించిన సీఎం, ఆయన దొరల గడీల ముందు తలవంచని ధైర్యవంతుడని కొనియాడారు.

గత బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ కవులకు, కళాకారులకు తీవ్ర అవమానాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రగతిభవన్ గేటు బయట ఎండలో నిలబెట్టడం గత పాలకుల అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కవులను అవమానించినప్పుడే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

నిరుద్యోగుల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును సీఎం తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదని, ఫలితంగా ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగుల తల్లిదండ్రుల సమక్షంలో నియామక పత్రాలను అందజేసినట్లు గుర్తుచేశారు.

రాష్ట్రాన్ని దోచుకుని కల్వకుంట్ల కుటుంబం నిజాం రాజులను మించిన ధనవంతులుగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత వేల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు తమను క్షమించారని భ్రమపడవద్దని, తాను ఉన్నంతవరకు తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు.