శరీరానికి అవసరమైన పరిమితికి మించి ప్రొటీన్ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ జీర్ణమైనప్పుడు నైట్రోజన్, అమోనియా వంటి వ్యర్థాలు విడుదలవుతాయి. వీటిని వడపోసి బయటకు పంపే క్రమంలో మూత్రపిండాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ భారం వల్ల భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
హై-ప్రొటీన్ డైట్ పాటిస్తున్నప్పుడు చాలామంది పీచు పదార్థం ఉండే ఆకుకూరలు, కూరగాయలను నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు వేధిస్తాయి. అలాగే, తగినంత నీరు తాగకపోతే శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల నీరసం, తలనొప్పి, మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రొటీన్ కోసం రెడ్ మీట్, ఫుల్-ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. వీటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతాయి. అంతేకాకుండా, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే ఆ అదనపు క్యాలరీలు కొవ్వుగా మారి బరువు పెరగడానికి దారితీస్తాయి. కీటోసిస్ ప్రక్రియ వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా తలెత్తవచ్చు.
మీ శరీర బరువు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంత ప్రొటీన్ తీసుకోవాలో తెలుసుకోవడానికి అర్హులైన డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.








