శ్రావణ మాసంలో నాన్‌వెజ్ తినని వారు చికెన్, మటన్ ముక్కల మాదిరిగానే ఉండే సోయా చంక్స్ డ్రైని ప్రయత్నించవచ్చు. సోయా చంక్స్ (మిల్ మేకర్) ప్రొటీన్లు అందించడంలో చాలా ముందుంటాయి. ఈ వంటకం కోసం ముప్పావు నుంచి ఒక కప్పు సోయా చంక్స్, రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కారం, గరం మసాలా, పసుపు, నూనె, కొత్తిమీర, ఉప్పు సిద్ధం చేసుకోవాలి.

ముందుగా మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో సోయా చంక్స్ వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపి, చల్లటి నీటితో రెండుసార్లు కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. పిండిన చంక్స్‌లో అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ కారం, అర టీస్పూన్ గరం మసాలా కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.

పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమాటా గుజ్జుగా మారిన తర్వాత నానబెట్టిన సోయా చంక్స్, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.

చివరగా మూత పెట్టి సన్నని మంటపై మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం మరీ పొడిగా ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. మసాలాలన్నీ ముక్కలకు పట్టి మంచి సువాసన వచ్చాక, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. ఈ కారకారమైన సోయా డ్రై ఫ్రైని వేడివేడి అన్నం లేదా రోటీలతో కలిపి తినవచ్చు.