చాలామంది ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే తాగుతుంటారు. అయితే, ఇలా తక్కువగా తాగినా గుండె, రక్తనాళాలు, మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. సిగరెట్ పొగలోని నికోటిన్ రక్తపోటును పెంచితే, కార్బన్ మోనాక్సైడ్ రక్తం ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఈ అలవాటు వల్ల రక్తనాళాల లోపలి పొర దెబ్బతిని, కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా రక్తనాళాలు ఇరుకుగా మారి రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా నిద్రకు ముందు తాగే సిగరెట్ కూడా శరీరంలోకి విషపూరిత పదార్థాలను చేరుస్తుంది. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.

ముఖం ఒకవైపు వాలిపోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, కాలు లేదా చేయి బలహీనపడటం వంటి స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. స్ట్రోక్ రకాన్ని బట్టి రక్తం గడ్డను కరిగించే మందులు లేదా మెకానికల్ థ్రాంబెక్టమీ (రక్తం గడ్డను తొలగించే ప్రక్రియ) వంటి చికిత్సలు అవసరం కావచ్చు. లక్షణాలు మొదలైన వెంటనే వైద్య సహాయం పొందడం చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది.

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ధూమపానాన్ని పూర్తిగా మానేయడమే అత్యంత సురక్షితమైన మార్గం. సిగరెట్ల సంఖ్యను తగ్గించడం ప్రారంభ దశగా ఉపయోగపడినా, పూర్తిగా మానేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, రక్తపోటు, మధుమేహ నియంత్రణ మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం.