తిరుపతి జిల్లా జంగాలపల్లి గ్రామంలో కుటుంబ కక్షల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ ద్విహత్య కేసులో ప్రధాన నిందితులైన వాసు, ఆయన కుమారులు సునీల్, ఉపేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించారు.

సునీల్‌కు గత పది నెలలుగా భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ వివాదంలో గ్రామ పెద్దగా వ్యవహరించిన మునిరత్నం తరచూ సునీల్‌ను ప్రశ్నిస్తూ, కుటుంబ సమస్యలు స్వయంగా పరిష్కరించుకోవాలని మందలిస్తూ వచ్చారు. దీంతో తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆగ్రహం సునీల్ కుటుంబంలో పెరిగింది.

వివాహ వేడుక ఒకటి జరుగుతుండగా, మునిరత్నం, మణికంఠలు సునీల్‌ను మళ్లీ కుటుంబ గొడవల గురించి ప్రశ్నించారు. దీంతో ఊగిపోయిన సునీల్ కుటుంబీకులు ముందే తెచ్చుకున్న కత్తులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

నిందితుల కదలికలు, ఆధారాలను పరిశీలించి పోలీసులు వేగంగా కేసును ఛేదించారు. కుటుంబ వివాదాలు, పాత కక్షలే ఈ ఘాతుకానికి కారణమని నిర్ధారించిన పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.