ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఈ నెల 23న జరిగిన చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఇన్నోవా కారులో తిరుగుతూ పగటిపూట రెక్కీ నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు మీసాల వెంకట వంశీకృష్ణ ఇంటి తాళాలు పగులగొట్టి, 157 గ్రాముల బంగారు నగలు మరియు 51 వేల నగదును అపహరించారు.
ఈ ముఠాలో నెల్లూరు జిల్లాకు చెందిన గోపిశెట్టి సునీల్, పల్నాడు జిల్లాకు చెందిన అన్నదమ్ములు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి ఆనంద్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మలమంతి సాయికుమార్ ఉన్నారు. వీరంతా గతంలో వివిధ చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి, అక్కడ పరిచయమై ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చాక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చీరాల, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారు.
ఘటన జరిగిన రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి యజమాని బయటకు వెళ్లిన విషయాన్ని గమనించి నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 18 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 51 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ కేసును వారం రోజుల్లోనే ఛేదించిన ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు, మద్దిపాడు ఎస్ఐ వెంకటసూర్య మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.








