రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అల్ సబా హోటల్ వద్ద పోలీసులు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఒక రెడ్ అంబులెన్స్‌ను ఆపి, డ్రైవర్ రాఘవేంద్రకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షలో రాఘవేంద్ర ఆల్కహాల్ లెవల్ 324గా నమోదైంది. సాధారణంగా 30 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. అయితే, అనుమతించదగిన పరిమితిని మించి ఇంత భారీ స్థాయిలో రీడింగ్ నమోదు కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

మద్యం మత్తులో అంబులెన్స్ నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు రాఘవేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు, అతను నడుపుతున్న అంబులెన్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.