న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్ రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఒక మహిళ భారీగా మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో రైలు సమస్తిపూర్ స్టేషన్‌కు చేరుకోగానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బృందాలు రైలును తనిఖీ చేశాయి.
ఆ మహిళ వద్ద ఉన్న బ్యాగులు, బ్రీఫ్‌కేసులను తనిఖీ చేయగా, అందులో 75 లీటర్ల వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నేహా కుమారి అలియాస్ నేహా ఝాను అరెస్ట్ చేశారు. మద్యం అమ్మకాలు, వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నేహా కుటుంబ నేపథ్యంపై పోలీసులు ఆరా తీశారు. ఆమె సోదరిపై దర్భంగా జిల్లాలో మద్యం సంబంధిత కేసు నమోదై ఉండగా, ఆమె తండ్రి పంకజ్ కుమార్ ఝా కూడా రెండేళ్ల క్రితం ఇదే తరహా కేసులో అరెస్టయ్యారు. నేహా తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు.
నేహాపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవని పోలీసులు తెలిపారు. అయితే, ఆమె కుటుంబ సభ్యులపై ఉన్న కేసుల ఆధారంగా, నేహా మద్యం అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు వైద్యులు, ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని, వారికి ఈ మద్యం సరఫరా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరాల్సి ఉంది, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేహా తన బావ సోదరుడితో కలిసి ఈ మద్యం తరలించినట్లు సమాచారం.








