కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొత్త కాలనీకి చెందిన కర్రి నాగేశ్వరరెడ్డి, దుర్గాలక్ష్మీ దంపతులు తమ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిట్టీల వ్యాపారంలో ఎదురైన నష్టాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

తాము నిర్వహిస్తున్న చిట్టీల వ్యాపారంలో భాగంగా ఒక మహిళకు కోటి రూపాయలు ఇచ్చామని, ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, ఇతర చిట్టీ సభ్యుల నుంచి కూడా తమపై ఒత్తిడి పెరిగిందని వారు ఆ లేఖలో వివరించారు.

గత నెల 31న కొప్పిశెట్టి నాగమల్లేశ్వరి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఈ దంపతులపై ప్రభావం చూపింది. నాగేశ్వరరెడ్డి నుంచి రావాల్సిన రూ.15 లక్షలు తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడగా, ఆ ఘటనతో నాగేశ్వరరెడ్డి దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.