ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన దీక్షా స్థలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్ 20 రోజులకు పైగా చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన తర్వాత, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఆమరణ దీక్షకు దిగారు. ప్రస్తుతం దీక్షా స్థలిని పోలీసులు చుట్టుముట్టడంతో పరిస్థితి వేడెక్కింది.

సోమవారం (జులై 20) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజున సీజేపీ 'చలో పార్లమెంటు' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్లమెంటు సమావేశాల సమయంలో ఈ నిరసనను అడ్డుకునేందుకే పోలీసులు భారీగా మోహరించారని సీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సాయంత్రం 7 గంటల తర్వాత దీక్షకు అనుమతి లేదని, వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సోనం వాంగ్ చుక్ తరలింపు సమయంలో కూడా పోలీసులు ఇదే విధంగా వ్యవహరించారని, ఇప్పుడు దీప్కేతో పాటు విద్యార్థి సంఘాల నేతలను కూడా అక్కడి నుంచి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీజేపీ పిలుపుతో భారీ సంఖ్యలో మద్దతుదారులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఢిల్లీలో అడుగడుగునా పోలీసుల పహారా కొనసాగుతోంది.