డీఎస్సీ అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినా, వైసీపీ నాయకులు ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. బ్రిడ్జ్ గేమ్ కేంద్ర ప్రభుత్వ విధానమని, దానిని పేకాటతో పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఎనిమిది నెలలుగా విధులు నిర్వహిస్తుంటే, వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

గత వైసీపీ పాలనలో యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 220 కేసులు వేశారని బోండా ఉమా గుర్తుచేశారు. అయితే కోర్టు ఆ ఆరోపణలను ప్రాథమిక దశలోనే తిరస్కరించి, నియామకాలు సక్రమంగా జరిగాయని ధృవీకరించిందని ఆయన తెలిపారు. ముత్యాలంపాడులో రౌడీషీటర్లను తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గంలో ప్రశాంతతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేసిన బోండా ఉమా, బియ్యం కేసు వ్యవహారంలో ఆయన పాత్ర బయటపడిందని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే బందరు వెళ్లి బుద్ధి చెబుతానని హెచ్చరించారు. శాంతియుత ఆందోళనలకు తమకు అభ్యంతరం లేదని, కానీ హద్దులు దాటితే తమ శైలిలో సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించానని, అభివృద్ధిలో నియోజకవర్గం ఎనిమిదో స్థానంలో ఉందని ఆయన వివరించారు.