50 ఏళ్లు దాటిన వారు రోగనిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవడంతో పాటు, ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మైదాతో చేసిన వైట్ బ్రెడ్, పాస్తా, కేకులు వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను మానేయాలి. వీటిలో పీచు పదార్థం లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది, ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం, బరువు పెరిగే ప్రమాదం ఉంది.

సాసేజ్‌లు, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసంలో ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తింటే రక్తపోటు హఠాత్తుగా పెరగడమే కాకుండా, సాచురేటెడ్ కొవ్వుల వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్యాక్ చేసిన జ్యూస్‌లు, డైట్ సోడాల్లో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు ప్రేగుల్లోని మంచి బాక్టీరియాను దెబ్బతీస్తాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను పెంచి లివర్ సమస్యలకు దారితీస్తాయి.

వయసు పైబడే కొద్దీ మూత్రపిండాల సోడియం శుద్ధి చేసే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి బజ్జీలు, చిప్స్, ఊరగాయల వంటి అధిక ఉప్పు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిలోని ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసి వృద్ధాప్య ఛాయలను వేగవంతం చేస్తాయి. అలాగే ఫుల్ ఫ్యాట్ పాలు, చీజ్, వెన్నకు బదులుగా స్కిమ్డ్ మిల్క్ లేదా మజ్జిగను ఎంచుకోవడం ఆరోగ్యానికి సురక్షితం.

ఈ సూచనలు అంతర్జాతీయ ఆరోగ్య నివేదికల విశ్లేషణల ఆధారంగా అందించబడ్డాయి. అయితే, వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, బిపి, షుగర్ స్థాయిలను బట్టి సరైన డైట్ ప్లాన్ కోసం అర్హులైన ఫిజీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.