బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కెటిఆర్ చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

గత పదేళ్ల అధికార కాలంలో ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లని కెటిఆర్, ఇప్పుడు నిరుద్యోగుల పట్ల ప్రేమ ఒలకబోయడం కేవలం రాజకీయ అవకాశవాదమేనని అడ్లూరి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేసిన బిఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

యువ సంగ్రామ సభలో కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు యువతను మభ్యపెట్టే ప్రయత్నాలని మంత్రి ఆరోపించారు. పేపర్ లీకుల పాలన బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని, తాము మాత్రం కొలువుల జాతర నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కెటిఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా అధికారిక గణాంకాలతో ఉద్యోగాల వివరాలను మంత్రి వెల్లడించారు.

యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఇకపై సాగవని మంత్రి హెచ్చరించారు. ముందుగా యువతకు క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రభుత్వాన్ని విమర్శించాలని ఆయన కెటిఆర్‌కు సూచించారు.