సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి హెచ్చరించిన రెండు రోజులకే సత్యవేడు టీడీపీ నేతలు మళ్లీ రోడ్డెక్కారు. అధినేత సమన్వయంతో పనిచేయాలని సూచించినా, ఎమ్మెల్యే వర్గం, కోఆర్డినేటర్ వర్గం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రెస్ మీట్లు పెట్టారు. దీంతో అధినేత మాట కంటే సొంత పెత్తనమే ఎక్కువైందని ప్రజల్లో విమర్శలు వినపడుతున్నాయి.
నియోజకవర్గంలో పెత్తనం తనదేనని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ ప్రచారం చేసుకోవడం రచ్చకు దారితీసింది. దీనికి కౌంటర్‌గా కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం నుంచి కొత్త ఆదేశాలు రాలేదని, ఇన్‌ఛార్జ్‌లను పక్కనపెట్టి కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని లక్ష్మి స్పష్టం చేశారు.
శ్రీసిటీలో జరిగిన సమావేశంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినా స్థానిక నేతల కమీషన్ల దందానే గొడవలకు కారణమని టాక్ నడుస్తోంది. ఇరువర్గాల పెత్తనంతో క్యాడర్ ఎమ్మెల్యే ఆఫీస్‌కా, కోఆర్డినేటర్ ఆఫీస్‌కా వెళ్లాలో తెలియక సతమతమవుతోంది.
గ్రూపు వార్ వల్ల ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సీరియస్ యాక్షన్ లేకపోతే ప్రయోజనం శూన్యమనే మాట పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.







