ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ కావడంతో, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీ ముందు హాజరయ్యారు. పార్టీకి నష్టం కలిగించేలా తాను ఎప్పుడూ ప్రవర్తించలేదని, వైసీపీ హయాంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తాను అండగా నిలిచానని ఆయన కమిటీకి వివరించారు.
సభకు హాజరైన తనను కొందరు కావాలనే వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని బోండా ఉమ ఆరోపించారు. అంబటి రాంబాబు తన పక్కన కూర్చున్నప్పుడు మర్యాదపూర్వకంగానే నమస్కారం చేశానని, నివాళులర్పించే సమయంలో కూడా ఆయన వెంట రావడంపై జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేవలం మర్యాదపూర్వకమైన కార్యక్రమం కోసం వెళ్లిన తనపై విషప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగిందేమోననే ఉద్దేశంతో అధిష్టానం తనను వివరణ కోరిందని, జరిగిన వాస్తవాలను కమిటీకి వివరించానని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని, ఇకపై వైసీపీ నేతలు పాల్గొనే సమావేశాలకు వెళ్లనని ఆయన హామీ ఇచ్చారు. బోండా ఉమ ఇచ్చిన వివరణతో టీడీపీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను కలిసి ఈ అంశంపై పూర్తిస్థాయిలో వివరణ ఇస్తానని బోండా ఉమ వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు, పార్టీ శ్రేణులు నమ్మవద్దని ఆయన కోరారు.







