భారత నావికాదళం తన సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రాజెక్టు 17ఏ కింద తయారైన ఆరవ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా సేవలు ప్రారంభించింది. జూలై 11వ తేదీ శనివారం విశాఖ నేవల్ డాక్ యార్డ్‌లో జరిగిన కమిషనింగ్ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై, ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు.

ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించగా, మేరీ వర్షిప్ డిజైన్ బ్యూరో దీనికి రూపకల్పన చేసింది. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు. శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల తర్వాత వస్తున్న ఈ సిరీస్‌లో మొత్తం ఏడు నౌకలను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 6,670 టన్నులు. గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణించగల ఈ నౌకలో బ్రహ్మోస్, క్రూజ్ క్షిపణులు, 76 ఎంఎం నేవల్ గన్, ట్రిపుల్ టోర్పిడో వరుణాస్త్రాలు, రాకెట్ లాంఛర్లు అమర్చారు. శత్రు రాడార్లకు చిక్కకుండా దాడి చేసే స్టెల్త్ సాంకేతికత, అత్యాధునిక సోనార్, రాడార్ వ్యవస్థలు దీనికి అదనపు బలంగా నిలుస్తాయి.

ఈ నౌకలో 75 శాతానికిపైగా స్వదేశీ పరికరాలను వినియోగించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ప్రాణం పోశారు. పలు భారతీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు నిర్మాణంలో పాల్గొన్నాయి. కంబైన్డ్ డీజిల్ అండ్ గ్యాస్ ప్రొపల్షన్ వ్యవస్థ కారణంగా అధిక వేగంతో పాటు దీర్ఘకాలం పాటు సముద్రంలో విధులు నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది.

ఇకపై ఐఎన్ఎస్ మహేంద్రగిరి బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిధిలో నిఘా, రక్షణ విధులు నిర్వహించనుంది. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మక హిందూ పసిఫిక్ ప్రాంతంలో భారత సముద్ర ప్రయోజనాల రక్షణలో ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది.