తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలుస్తుందని ఖమ్మం వేదికగా ప్రకటించారు. చింతకాని మండలం జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన 'రైతు ఆశీర్వాద సభ'కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్ చివరి విడత నిధులు రూ.1009 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దీంతో మొత్తం అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని సీఎం వివరించారు. ప్రస్తుతం 117 స్థానాలతో అధికారంలో ఉన్న కాంగ్రెస్, పెరిగిన స్థానాల్లో కూడా అదే సంఖ్యలో సీట్లు సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా గుండెకాయలా నిలిచిందని, 2023 ఎన్నికల ముందు కీలక నేతలు పార్టీలో చేరడమే ఈ విజయానికి పునాది అని రేవంత్ గుర్తుచేశారు.
ఈ వేదిక నుంచే బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి, కారు పార్టీ మళ్లీ బలపడకుండా చూస్తామని హెచ్చరించారు. 2023లో సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, రైతు సంక్షేమం, అభివృద్ధి, ప్రజాపాలన అంశాలతో ముందుకెళ్లి ప్రజల తీర్పు కోరాలన్నదే తమ వ్యూహమని ఆయన తెలిపారు. భద్రాచలం రాముడి సాక్షిగా తాను చేసిన ఈ రాజకీయ ప్రతిజ్ఞ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని సీఎం అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అధికార పార్టీ ఇప్పటినుంచే రాజకీయ రణరంగానికి సిద్ధమవుతోంది. 117 సీట్ల లక్ష్యం సాధ్యమవుతుందా, ప్రతిపక్షాల బలం, ప్రజాభిప్రాయం ఎలా మారుతుందన్న అంశాలపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.








