మునుగోడు నియోజకవర్గంలోని వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల వైద్యాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHC) మరియు ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు, సిబ్బంది, సాంకేతిక పరికరాల వివరాలతో కూడిన పూర్తి నివేదికలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురైన బాధితులు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్‌లో తక్షణమే ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడ 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. దీనితో పాటు మునుగోడు, నాంపల్లి PHCలను 30 పడకల ఆసుపత్రులుగా ఆధునీకరించాలని, మర్రిగూడ CHC సామర్థ్యాన్ని 50 పడకలకు పెంచి పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రస్తుత బడ్జెట్ వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు సరిపోవడం లేదని అభిప్రాయపడిన ఎమ్మెల్యే, ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల పెంపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైద్య వృత్తి పవిత్రమైనదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా అధికారులు, వైద్యులు నిబద్ధతతో పని చేయాలని ఆయన కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ రాహుల్, డిసిహెచ్ మాతృనాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ మనోహర్, డిసిహెచ్ సూర్యశ్రీలతో పాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. చండూరులో 100 పడకల ఏరియా ఆసుపత్రి మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.