కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన విఫలమైందని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో జరగాల్సిన ధర్నాకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, నరేందర్ రెడ్డిని తీసుకెళ్తున్న పోలీసు వాహనం దారిలో అకస్మాత్తుగా ఆగిపోయింది. వాహనంలో డీజిల్ అయిపోవడమే దీనికి కారణమని తేలింది. దీంతో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలీసు వాహనాలకు కూడా డీజిల్ లేని పరిస్థితి ఉందని కార్యకర్తలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పోలీసుల వాహనాలకే దిక్కులేదని, డొక్కు వాహనాలు తీసుకురావడంతో రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని వారు ఆరోపించారు.

ఈ వాహనం రోడ్డుపై నిలిచిపోవడంతో అంబులెన్స్‌కు కూడా ఇబ్బంది కలిగింది. గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ వాహనం ఆగిపోయిన పోలీసు వాహనం వల్ల ముందుకు వెళ్లలేకపోయింది.

దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అంతా కలిసి డీజిల్ లేక ఆగిపోయిన ఆ పోలీసు వాహనాన్ని పక్కకు తోశారు. ఆ తర్వాత అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.