మాజీ ముఖ్యమంత్రి KCR నివాసం వద్ద చావుడప్పు కొట్టడమే కాకుండా, ఆయన మరణాన్ని కోరుకుంటున్నానని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా ప్రతినిధితో మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించారు. ఈ రాష్ర్టానికి పట్టిన పీడ కేసీఆర్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. డిగ్రీ లెక్చరర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో, కేసీఆర్ స్ట్రెచర్‌పై ఉన్నారని విర్రవీగితే మార్చురీకి వెళ్తారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో విమర్శలకు దారితీశాయి. మరో సందర్భంలో కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందని కూడా ఆయన అన్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, మరణాన్ని కోరుకోవడం రాజకీయ ప్రమాణాలకు విరుద్ధమని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేసీఆర్, తాను వెయ్యి జన్మలెత్తినా చావనని ఘాటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల తీరుపై ఆ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు, వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావాలని కోరుకోలేదని, కేవలం చావుడప్పు కొడతామని మాత్రమే అన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెనుకేసుకొచ్చారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తానే అనుకుంటే ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సభ్యత్వాలను రద్దు చేయగలనని, కానీ అది పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసుల దాడి గురించి అడగగా, దీనిపై విచారణకు ఆదేశించామని స్పీకర్ తెలిపారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, ఎమ్మెల్యేలే పోలీసులను కొట్టినట్లుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.








