ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అని సంబోధించడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల భవిష్యత్తును, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని అగ్రగామి సంస్థల్లో తెలంగాణ విద్యార్థులు అత్యున్నత పదవుల్లో రాణిస్తున్నారని కొప్పుల గుర్తు చేశారు. రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న విద్యార్థుల మేధస్సును, కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడే హక్కు ముఖ్యమంత్రికి లేదని ఆయన ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తక్షణమే విద్యార్థులకు, వారి కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ వ్యాఖ్యలను కూడా బీఆర్‌ఎస్ పార్టీ సహించబోదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.