ప్రతిపక్షాల మాటలు నమ్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నాలు, దీక్షలు వంటి ఆందోళనలకు దిగవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. టీచర్లు రోడ్ల మీదకు వస్తే అది రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచిది కాదని, పిల్లల మనస్సులపై దీని ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్షాలు టీచర్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో పదేళ్ల పాటు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు దానిని వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం చెప్పారు. పాతబడిన సిలబస్ స్థానంలో ఆధునిక నైపుణ్యాలను అందించేందుకు ఐటీఐలను ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లుగా మారుస్తున్నట్లు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఈ మార్పులు చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం స్పందిస్తూ, తన ప్రభుత్వం ఉద్యోగుల పట్ల బాధ్యతగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు)లో, తాము అధికారంలోకి వచ్చాక 90 రోజుల్లోనే రూ. 6 వేల కోట్లను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. రానున్న రెండేళ్లలో సమస్యలు పరిష్కరించకుంటే, తదుపరి ఎన్నికల్లో తనను ఓడించాలని ఆయన సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను కల్వకుంట్ల కవితకు అప్పగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన వారిని నమ్మవద్దని, కేసీఆర్ కుటుంబం సంపాదించిన ఆస్తుల కోసం అన్నాచెల్లెళ్లు కొట్లాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కొడంగల్ ప్రాంతానికి రావడానికి టీచర్లు ఇబ్బంది పడుతున్నారని వస్తున్న వార్తలను సీఎం కొట్టిపారేశారు. కొడంగల్ అన్ని రకాలుగా అనుసంధానమై ఉందని, ఇక్కడికి రావడానికి టీచర్లకు ఎలాంటి బాధ లేదని ఆయన స్పష్టం చేశారు. తన పర్యటనలో భాగంగా కొడంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్, ఇందిరమ్మ క్యాంటీన్ వంటి పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.