కొరాపుట్ జిల్లా కేంద్రంలో శనివారం బీజేడీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, పార్టీకి చెందిన విద్యార్థి, యువజన మరియు మహిళా విభాగాల నేతలు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ చేపట్టారు.
ఈ సందర్భంగా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్సితా సాహు మాట్లాడుతూ, ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలు నాణ్యత లేక నిరుపయోగంగా మారాయని విమర్శించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆమె ఆరోపించారు. మంత్రి సుమారు 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారనే వార్తలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)తో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
నిరసనలో భాగంగా సీఎం మోహన్ చరణ్ మాఝీ మరియు మంత్రి నిత్యానంద గొండో చిత్రపటాలకు ఎండు చేపలు బహుకరించి, నెయ్యి పోసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రబినారాయణ నందో, కేసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర్ చంద్ర పాణిగ్రాహి, జెడ్పీ చైర్‌పర్సన్ సస్మితా మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఆందోళన ముగిసిన అనంతరం, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో నేతలు అందజేశారు.





