ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గురువారం సహారా బాధితులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది సహారా ఖాతాదారుల కష్టార్జితాన్ని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2012 నుంచి సుప్రీంకోర్టులో నలుగుతున్న ఈ వివాదానికి పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
సహారా సంస్థపై 2012లో నమోదైన కేసు కారణంగా లక్షలాది కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో పడిందని వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పరిష్కారం దిశగా తగిన చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. బాధితులకు న్యాయం చేసేందుకు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఖాతాదారులతో పాటు 15 లక్షల మంది ఏజెంట్ల పీఎఫ్ చెల్లింపులు చేయాలని, వారికి ఉపాధి కల్పించి భరోసా ఇవ్వాలని ఎంపీ కోరారు. ప్రజాప్రతినిధిగా అన్యాయానికి గురైన ప్రతి వర్గానికి అండగా ఉండటం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, తనవంతు కృషి చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు.








