ఖాన్‌ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్య నారాయణ రెడ్డి, నటుడు సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పైలా ప్రసాద రావు, కిషోర్ గుండాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ, తన జీవితంలోని కొన్ని నిజ జీవిత ఘటనలకు కల్పిత అంశాలను జోడించి ఈ లవ్‌స్టోరీని రూపొందించినట్లు తెలిపారు. కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని హీరో ఖాన్ దురాని పేర్కొన్నారు. చిత్రంలోని నాలుగు పాటలకు శ్రీ మురళి సంగీతం అందించారు.

కార్పొరేట్ ప్రపంచం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగానికి వచ్చినట్లు నిర్మాత కిషోర్ గుండాల చెప్పారు. యూఎస్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసిన ఆయన, ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని తెలిపారు. 'రామాయణం ఎవరి కథ కాదమ్మా', 'ఇక మా మధ్య ఎవరూ లేరు' వంటి డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.