కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీలు (JMET) బుధవారం నుంచి 72 గంటల నిరసన దీక్షకు దిగారు. 2016-17లో విధుల్లో చేరిన 800 మందిలో, ఇప్పటివరకు కేవలం 200 మందికి మాత్రమే ఓవర్‌మెన్‌లుగా పదోన్నతులు లభించాయని ఉద్యోగులు తెలిపారు. మిగిలిన 600 మందికి కూడా వెంటనే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పదోన్నతుల గురించి యాజమాన్యాన్ని అడిగితే బదిలీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, అర్హత ఆధారంగా ఓవర్‌మెన్‌లుగా పదోన్నతులు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ నిరసన దీక్షలకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగులకు అండగా ఉంటామని రాజిరెడ్డి భరోసా ఇచ్చారు.







