నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లా, రాణీపౌవా గ్రామంలో అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య ముక్తినాథ్ ఆలయం ఉంది. సముద్రమట్టానికి సుమారు 3,710 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం, స్కాంద పురాణంలోని హిమవత్ఖండంలో పేర్కొన్న విధంగా అత్యంత మహిమాన్వితమైనది.
పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు జలంధరుడిని వధించిన తర్వాత, బృందాదేవి శాపం వల్ల కాళీగండకీ నదీ తీరంలో సాలగ్రామ శిలగా అవతరించాడు. ఆ శాప విముక్తి కోసం స్వామి ఇక్కడ వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ముక్తిని పొందాడు. భగవంతుడికే ముక్తిని ప్రసాదించిన ప్రదేశం కావడంతో దీనికి ముక్తిక్షేత్రం అనే పేరు వచ్చింది.
ఈ ఆలయ ప్రాంగణంలో పాపకుండం, పుణ్యకుండం అనే రెండు కొలనులు ఉన్నాయి. వీటిలో స్నానాలు ఆచరించిన భక్తులు, ఆలయం వెనుక ఉన్న 108 గోముఖ జలధారల కింద స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. హిందువులతో పాటు బౌద్ధులు కూడా ఈ ప్రదేశాన్ని 'చుమిగ్ గ్యాత్సా'గా పిలుస్తూ అత్యంత పవిత్రంగా పూజిస్తారు.
ముక్తినాథ్ చేరుకోవడానికి గోరఖ్‌పూర్ నుంచి సునోలి సరిహద్దు మీదుగా పోఖ్రా, జోమ్‌సోమ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మెట్ల మార్గంలో లేదా గుర్రాలు, డోలీల ద్వారా ఆలయానికి వెళ్లవచ్చు. అధిక ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉండే ఈ ప్రాంతానికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది.







