రఘునాథపాలెంలో ఆగస్టు 5న ఈ కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటివరకు కేవలం యూరియా కోసం మాత్రమే యాప్‌ను వినియోగిస్తున్న రైతులు, ఇకపై డీఏపీ, పొటాష్, 20-20-0-13, 28-28-0 వంటి అన్ని రకాల ఎరువులను 'ఫేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్' (FFS) యాప్ ద్వారానే కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
ఈ విధానం అమలు కావాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ లేని పక్షంలో, ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటేనే యాప్‌లో లాగిన్ అవ్వడం సాధ్యమవుతుంది. అయితే, జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
సాంకేతిక పరిజ్ఞానం లేని వారు, స్మార్ట్‌ఫోన్‌లు లేని రైతులు ఈ కొత్త విధానంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత యాప్ ద్వారా ఎకరానికి గరిష్టంగా రెండు బస్తాల ఎరువులు మాత్రమే అందేవి. ఇప్పుడు కొత్త యాప్‌లో ఎన్ని బస్తాలు ఇస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో, పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి అందుతాయో లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పీఎం కిసాన్, రైతు భరోసా, రాయితీలు మరియు పంటల బీమా వంటి పథకాలు పొందాలన్నా ఈ రిజిస్ట్రీ తప్పనిసరి కావడంతో రైతులు సతమతమవుతున్నారు. సాగు చేయడమే కష్టంగా మారుతోందని వారు వాపోతున్నారు.







