రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో 2.45 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, సగటున రోజుకు 10 గంటలకు మించి కరెంటు సరఫరా కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4,01,851 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం వ్యవసాయానికి 18-20 గంటల విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటిస్తున్నా, ఇటీవల నల్లగొండ కలెక్టరేట్ సమీక్షలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ (విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్) 14-16 గంటల సరఫరా మాత్రమే జరుగుతోందని వెల్లడించారు. అయితే, క్షేత్రస్థాయిలో చాలా చోట్ల 8 నుంచి 12 గంటల కరెంటు మాత్రమే అందుతోందని, అది కూడా పదేపదే కోతలకు గురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోవోల్టేజీ సమస్య వల్ల మోటర్లు కాలిపోతుండటంతో రైతులు అదనపు మరమ్మతు ఖర్చులతో సతమతమవుతున్నారు.
విద్యుత్తు సరఫరా వివరాలను నమోదు చేసే లాగ్‌బుక్స్‌ను రహస్యంగా ఉంచాలని పైఅధికారులు ఆదేశించారని సిబ్బంది చెబుతున్నారు. కొన్ని సబ్‌స్టేషన్లలో రికార్డులు రాయడం మానేసి, కేవలం సెల్‌ఫోన్ల ద్వారానే సమాచారం పంపుతున్నారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్తు సామగ్రి కొరత తీవ్రంగా ఉందని, ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ప్రజాప్రతినిధులు వాపోయారు.
పంటలు ఎండిపోతుండటంతో నల్లగొండ, జగిత్యాల, కామారెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని సబ్‌స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు సబ్‌స్టేషన్ ముట్టడితో పాటు, పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కరెంటు కోతలు విధిస్తుండటంతో, మరో వారం పది రోజుల్లో పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.








