జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తానేదార్‌పల్లికి చెందిన ఆకుల లక్ష్మీనారాయణ అనే రైతుకు చెందిన భూమిని ప్రభుత్వం 22A జాబితాలో చేర్చింది. రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలులేని భూముల జాబితాను 22A అంటారు. 50 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసిన ఈ భూమిని, తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని లక్ష్మీనారాయణ కుటుంబం ఇన్నాళ్లుగా సాగు చేసుకుంటోంది.

కాలక్రమేణా లక్ష్మీనారాయణ తన భూమిని ఇద్దరు కొడుకులకు పంచారు. తాను కొనుగోలు చేసిన భూమిని పెద్ద కోడలు స్వర్ణలతకు ఇవ్వగా, ఆమె పేరు మీద పట్టా మార్పిడి కూడా పూర్తయింది. అయితే, ఇప్పుడు ఈ భూమి 22A జాబితాలో ఉందని పేర్కొంటూ కోర్టు నుంచి నోటీసులు రావడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది.

ఈ సమస్య కేవలం లక్ష్మీనారాయణది మాత్రమే కాదు, తానేదార్‌పల్లి గ్రామంలోని మరో 30 మంది రైతులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాము ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని, సొంతంగా కొనుగోలు చేసిన భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే మూడుసార్లు కోర్టుకు వెళ్లినట్లు వారు తెలిపారు.

వ్యవసాయం చేసుకుని బతకాల్సిన తాము, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిశీలించి, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వారు కోరుతున్నారు. దీనివల్ల తమకు మనశ్శాంతి లభిస్తుందని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు.