ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో యూఫ్లెక్స్, శ్రీటెక్, సీ-టెల్ సంస్థల కన్సార్షియంకు హాలోగ్రామ్ లేబుళ్ల సరఫరా బాధ్యతను అప్పగించారు. 2018లో ఈ ఒప్పందం గడువు ముగిసినప్పటికీ, నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వం ప్రతిసారీ కాంట్రాక్టును పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం నెలకు 15 కోట్ల లేబుళ్లను సరఫరా చేస్తున్నందుకు ప్రభుత్వం నెలకు రూ.5 కోట్ల వరకు చెల్లిస్తోంది. ప్రారంభంలో లేబుల్ ధర 22 పైసలు ఉండగా, అది ఇప్పుడు 33 పైసలకు పెరిగింది.

ఈ కాంట్రాక్టును మార్చేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఫైళ్లు కార్యరూపం దాల్చడం లేదు. 2024లో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేయగా, 23 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఈ ప్రక్రియ ఇప్పటికీ ఫైనల్ కాలేదు. ఒక మీడియా అధిపతి కూడా ఈ టెండర్ దక్కించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, పాత సంస్థతో జరిగిన సర్దుబాట్ల కారణంగా వెనక్కి తగ్గినట్లు ఎక్సైజ్ వర్గాల సమాచారం.

గతంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రిజ్వీ, నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని ఫైలు కదిలించారు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ప్రస్తుతం మద్యం బాటిళ్లతో పాటు బీర్ బాటిళ్లకు కూడా నామినేషన్ పద్ధతిలోనే లేబుళ్లు సరఫరా చేయాలని పాత సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.