బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ల్యాండ్ మార్క్ పదో సీజన్‌తో మరింత గ్రాండ్‌గా రానుంది. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు చేయడంతో పాటు, గేమ్స్ మరియు టాస్కుల నిర్వహణలోనూ సమూల మార్పులు చేయనున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ షో ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హౌస్‌లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ (నందు), రాయల్ ఎంసీ రమణ, శివ్, చంద్రహాస్, కడలి సత్యనారాయణ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ జాబితాలో ముఖ్యంగా నిలిచిన పేరు కావ్యశ్రీది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ మాజీ ప్రేయసిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం తెలుగు మరియు కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తూ, పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గత సీజన్‌లోనూ ఆమె పేరు వినిపించినా హౌస్‌లోకి రాలేదు.

అయితే, ఈసారి మాత్రం కావ్యశ్రీని ఎలాగైనా హౌస్‌లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఎంత పారితోషికం అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. దీంతో ఈసారి కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయడం ఖాయమని అంటున్నారు.