భారత 15 ఏళ్ల యువ వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఆరంభం అంత సులభంగా సాగడం లేదు. సంజు శామ్సన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువకుడు.. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ మంచి ఆరంభాలు అందించినప్పటికీ..
వరుసగా 13, 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. రెండో మ్యాచ్‌లో విల్ జాక్స్ బౌలింగ్‌లోనూ, మూడో మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతికి దొరికిపోవడం గమనార్హం. ఈ తరహా ప్రదర్శనపై ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ మొయిన్ అలీ 'బియర్డ్ బిఫోర్ వికెట్' కార్యక్రమంలో మాట్లాడుతూ..
వైభవ్ చాలా ప్రతిభావంతుడని, కానీ రాబోయే రెండు మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయకపోతే అది పెద్ద సమస్యగా మారుతుందని హెచ్చరించాడు. గతంలో ఇలాంటి షార్ట్ బంతులను సిక్సర్లుగా మలచిన వైభవ్.. ప్రస్తుతం అవుట్ అవుతున్న విధానం అతని బలహీనత కాదని, అతనిపై తనకు ఎలాంటి ఆందోళన లేదని మొయిన్ అలీ స్పష్టం చేశాడు.
మరోవైపు, ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం ఐపీఎల్ ద్వారా సేకరించిన డేటా తమకు ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కొత్తగా వచ్చిన వైభవ్ గురించి ఐపీఎల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లభించిన సమాచారం ఆధారంగా.. అతను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో, ఎక్కడ బలంగా ఉన్నాడో తమ టీమ్ మేనేజ్‌మెంట్ విశ్లేషించిందని రషీద్ తెలిపాడు.
ఆ విశ్లేషణ ప్రకారం సిద్ధం చేసిన ప్రత్యేక ప్రణాళికలను బౌలింగ్ యూనిట్ మైదానంలో అమలు చేసిందని ఆయన వివరించాడు. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడటం వల్ల వైభవ్‌పై ఒత్తిడి ఉంటుందని, అయితే భారత్ అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కనిపిస్తోందని ఆదిల్ రషీద్ అభిప్రాయపడ్డాడు. సిరీస్ ముందుకు సాగుతున్న కొద్దీ, వేర్వేరు పరిస్థితుల్లో ఫామ్ కోల్పోతే ఎలా సర్దుబాటు చేసుకోవాలో ఈ యువ ఆటగాడు ఇక నుంచి నేర్చుకోవాల్సి ఉంటుందని రషీద్ విశ్లేషించాడు.






