హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సర్కిల్ మరియు టీవీ9 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించేందుకు రూ. 368 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీఓ 736ను జారీ చేసింది. హెచ్-సిటీ (H-City) మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం గతంలో రూ. 210 కోట్లుగా ఉండగా, అది ఇప్పుడు రూ. 368 కోట్లకు పెరిగింది. అదనంగా రూ. 158 కోట్ల భారం పడటంతో, విప్రో జంక్షన్ గ్రేడ్ సెపరేటర్ పనులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద రూ. 147 కోట్లతో రెండు లేన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నెం. 3 నుంచి జీవీకే మాల్ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
టీవీ9 జంక్షన్ వద్ద రూ. 221 కోట్లతో అత్యాధునిక స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వరకు మూడు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు రెండు లేన్ల అండర్‌పాస్ రానున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని కాంక్రీట్ ఫ్లైఓవర్ స్థానంలో స్టీల్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించారు.
ఈపీసీ (EPC) విధానంలో టెండర్లను పిలిచి పనులను వేగంగా ప్రారంభించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ పనులను ప్రధాన నిర్మాణ పనులతో పాటు సమాంతరంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.








