ధనుష్ 56వ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం నటి ప్రీతి ముకుందన్‌కు దక్కింది. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరసన్‌ మారి ముత్తు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ నటించనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే, ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్రంతో బిజీగా ఉండటంతో ధనుష్‌తో నటించే అవకాశం కోల్పోయారు. దీంతో ఆ స్థానంలో ప్రీతి ముకుందన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది.

తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ 'ఓం భీమ్‌ బుష్‌' చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత మంచు విష్ణు 'కన్నప్ప'లో నటించిన ఆమె, తమిళ చిత్రాల్లో అవకాశాలతో పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె 'దశమకన్'తో పాటు మలయాళం, హిందీలో 'నాగ్‌ జిల్లా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ధనుష్ ప్రస్తుతం రాజ్‌ కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో 'ఓం' చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ధనుష్ 56వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది.