బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అడుగుభాగం చంద్రుడిని ఢీకొట్టింది. ఐదంతస్తుల ఎత్తు ఉండే ఈ రాకెట్ భాగం, గతంలో జరిగిన ప్రయోగం తర్వాత దారితప్పి చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంది. వాస్తవానికి ఈ రాకెట్ భాగాన్ని పునర్వినియోగానికి వీలుగా రూపొందించినప్పటికీ, సరైన సమయంలో నియంత్రించకపోవడంతో అది అంతరిక్షంలో అదుపుతప్పింది.
నిరుడు జనవరిలో జరిగిన ఈ ప్రయోగం మినహా మిగిలిన ప్రక్రియ విజయవంతమైంది. గత 18 నెలలుగా భూమి, సూర్యుడు, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తులకు లోనవుతూ, సౌరశక్తిని గ్రహిస్తూ ఈ శకలం అంతరిక్షంలో ప్రయాణించింది. శాస్త్రవేత్తలు దీని గమనాన్ని ముందే అంచనా వేయగా, వారి లెక్కలు కచ్చితత్వంతో ఉన్నాయని తాజా ఘటనతో స్పష్టమైంది.
ప్రస్తుతం అంతరిక్షంలో సుమారు 32,000 ఉపగ్రహాలు వేగంగా సంచరిస్తున్నాయి. ఈ దశాబ్దం ముగిసేసరికి వీటి సంఖ్య 60,000కు చేరుతుందని అంచనా. పాత ఉపగ్రహాలు, రాకెట్ శకలాలు కలిపి సుమారు 13 కోట్ల వ్యర్థాలు అంతరిక్షంలో తిరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత నవంబర్‌లో చైనాకు చెందిన ఒక ఉపగ్రహాన్ని ఇలాంటి శకలం ఢీకొట్టడంతో అది పనికిరాకుండా పోయింది.
అంతరిక్ష వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి 1972లోనే అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. అయితే, ఏ శకలం వల్ల ప్రమాదం జరిగిందో గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉపగ్రహాలను భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాటంతటవే కాలిపోయేలా 'డిజైన్ ఫర్ డిమైజ్' విధానంలో రూపొందిస్తున్నారు. ప్రపంచ దేశాలు అంతరిక్ష వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.







