నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ రీఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది. జూన్ 21న జరిగిన ఈ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షలో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సాల్ 720కి 715 మార్కులు సాధించి సంయుక్తంగా టాపర్లుగా నిలిచారు. మొత్తం 138 మంది విద్యార్థులు 690 మార్కులకు పైగా స్కోర్ చేయగా, 19 మంది అభ్యర్థులు 700 మార్కులను దాటారు. అర్హత సాధించిన వారిలో 58 శాతానికి పైగా అమ్మాయిలే ఉండటం గమనార్హం.
పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే, 1,492 మంది అభ్యర్థులు 650 మార్కులు, 10,160 మంది 600 మార్కులు, 90,780 మంది 500 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ సాధించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా 1.7 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించగా, లక్షద్వీప్‌లో 43 మంది అర్హత పొందారు.
ఈ ఫలితాల్లో సత్తా చాటిన 138 మంది విద్యార్థుల్లో 93 శాతానికి పైగా మొదటిసారి పరీక్ష రాసిన వారేనని NTA పేర్కొంది. వీరిలో దాదాపు అందరూ 17 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారే. కౌన్సెలింగ్ మరియు మెడికల్ కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేలా ఈ ఫలితాలను విడుదల చేసినట్లు NTA తెలిపింది.






